ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

హెటెరో గ్రూప్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి తన కుమార్తె జ్ఞాపకార్థం నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే వేదికను పంచుకున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ నిర్మించిన ఆసుపత్రి, బీజేపీ ప్రధాని ప్రారంభించడం, కాంగ్రెస్ సీఎం పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సింధు ఆసుపత్రి చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్య రంగంలోని నూతన ఆవిష్కరణలను ఆసుపత్రి సేవల్లో భాగం చేయడాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. “హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచేందుకు ఇది గొప్ప ప్రయత్నం. ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు ఆసుపత్రి యాజమాన్యం ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.
సింధు ఆసుపత్రి ప్రారంభంతో హైదరాబాద్‌లో వైద్య సేవలు మరింత విస్తరించనున్నాయని, ముఖ్యంగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు లభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.