ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
వర్షాధారిత పథకంతో రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో అమలవుతున్న వర్షాధారిత అభివృద్ధి పథకాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం పరిశీలించి, రైతులకు అందిస్తున్న ఆధునిక పరికరాలు, రాయితీల వినియోగాన్ని క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతు కూర్మ కొమురయ్య కూరగాయల పొలాన్ని పరిశీలించి, పథకం కింద అందించిన వ్యవసాయ పరికరాల వినియోగాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ పథకం ద్వారా రైతులు పొందుతున్న లాభాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. వర్షాధారిత అభివృద్ధి పథకం కింద మొత్తం 115 మంది లబ్ధిదారులకు సుమారు రూ.32.10 లక్షల విలువైన రాయితీలు మరియు వ్యవసాయ పరికరాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్స్, తేనెటీగల పెంపక బాక్సులు వంటి పరికరాలు ఉన్నాయని తెలిపారు.
రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకొని, సమిష్టిగా పంటల విక్రయం చేయడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సమీకృతంగా వినియోగించుకుంటే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి. సోమేశ్వరరావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఉషారాణి, మండల రెవెన్యూ అధికారి పరమేశ్వర్, ఉద్యాన అధికారులు మౌనిక, అనూష, వ్యవసాయ అధికారి, హెచ్ఈఓలు విట్టల్, స్వామి, ఏఈ హౌసింగ్, సర్పంచ్ రాణి సురేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.