Take a fresh look at your lifestyle.

నిర్దిష్ట కాలపరిమితితో ఉద్యోగ నియామకాలు..18వ విడత ఉద్యోగ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వికసిత్ భారత్ లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలి
18వ విడత ఉద్యోగ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
213 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత
ముద్ర, తెలంగాణ బ్యూరో :

అన్ని మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితితో నియామక ప్రక్రియలను చేపడుతోందని కేంద్రబొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల్లో నియామక ప్రక్రియ క్రమబద్ధీకరణ, వేగవంతం కోసం 2022 నుంచి రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన యువత… వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీతో పాటు అంకుర సంస్థల ప్రోత్సాహం, కొత్త పెట్టుబడుల ఆకర్శణ ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పనపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. శనివారం చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో నిర్వహించిన 18వ విడత ఉద్యోగ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం అనిశ్చితుల మధ్య ప్రపంచ దేశాలకు భారత్ నమ్మకమైన గమ్యస్థానంగా ఉందన్నారు.. ఆయా దేశాల నుంచి వచ్చే కొత్త పెట్టుబడులు మన దేశంలో ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 213 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో సీఆర్‌పీఎఫ్‌లో 179, ఎస్‌ఎస్‌బీలో 5, ఐటీబీపీలో 16, బీఎస్‌ఎఫ్‌లో 5, ఐఎఫ్‌ఎల్‌యూలో 1, ఐఐటీ-హైదరాబాద్‌లో 3, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1, విద్యా మంత్రిత్వ శాఖలో 3 ప్రొఫెసర్లు ఉన్నారు. ఉద్యోగం పొందిన వారిలో 15 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ మెడికల్ ఐజీ గణేష్ చంద్ర పాడి, హైదరాబాద్ సెంటర్ డీఐజీ ఉదయ భాస్కర్ బిల్లా, కమాండెంట్ మోహన్ దాస్ కోబ్రుగాడే తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.