బొగ్గు టెండర్లపై విచారణకు మీనమేషాలు ఎందుకు?
భట్టిపై ప్రచారం వెనక ఉన్నది సీఎంయే
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి టెండర్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అనుయాయులకు, బామ్మర్దికి ఇచ్చిన టెండర్లు కూడా ఎందుకు రద్దు చేయరని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది కళ్లలో సంతోషం చూసేందుకు బొగ్గు గనులు కట్టబెట్టే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భట్టి విక్రమార్క మాటలతో నిరూపితం అయిందన్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కోసం స్కామ్ జరిగిందని భట్టి ఎందుకు చెప్పలేకపోయారని దాసోజు ప్రశ్నించారు. సోలార్ స్కామ్‌పైనా భట్టి స్పష్టత ఇవ్వలేదన్న ఆయన దోపిడీ కోసమే గద్దెనెక్కారా? అని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాభవన్ లో మీడియాతో మాట్లాడిన భట్టి… బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చారా.. లేదా? సమాదానం చెప్పాలన్నారు. విచారణకు మీనమేషాలు ఎందుకని ప్రశ్నించారు. లాల్ బహదూర్ శాస్త్రి లాగా టెండర్లు రద్దు చేశామని భట్టి తాను నిజాయితీపరుడని చెప్పుకొనే ప్రయత్నం చేశారన్నారు. భట్టిపై ప్రచారం వెనక కథ, స్క్రీన్‌ప్లే మొత్తం రేవంత్ రెడ్డే అని దాసోజు ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై హరీశ్‌రావు ఆధారాలతో బయటపెట్టారని చెప్పారు. హరీశ్‌రావు మాట్లాడగానే సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులతో ప్రకటనలు ఇప్పిస్తున్న అధికార పార్టీ నేతలు మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు వేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను తిట్టవద్దని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పరని భట్టిని ప్రశ్నించారు.