జగిత్యాలలో బిఆర్ఎస్ సన్నాహక సమావేశం…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కెసిఆర్ బహిరంగ సభకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రమణ , మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాబు రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ లతో కలిసి సన్నాహక సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బహిరంగ సభను ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించే వేదికగా మార్చాలని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ లో చేరబోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వాటి ప్రయోజనాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేయాలని, యువతను పెద్ద ఎత్తున సభకు తీసుకురావాలని నాయకులు కోరారు. సభ విజయవంతం కోసం మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతతో కృషి చేసి సభను ఘన విజయంగా చేయాలని, కార్యక్రమం నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నాయకులు సూచించారు. ఈ సభను చారిత్రాత్మక విజయంగా నిలిపి పార్టీకి మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.