సర్కారు స్కూళ్ల విద్యార్ధులకు అల్పాహారం
ఆర్ధిక వనరులు సమకూరితే త్వరలోనే అమలు
ఇప్పటికే సీఎం రేవంత్ సెగ్మెంట్లో ప్రారంభం
కామన్ స్కూల్ ఉంటేనే ఉమ్మడి కుటుంబం గా సమాజం
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి
ముద్ర, రంగారెడ్డి :
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకుని ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆర్ధిక వనరులు సమకూరితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ఎదిగే వయసులో పిల్లలకు సరైన ఆహారం లేక పరిపూర్ణంగా ఎదగలేకపోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ ఈ దిశగా ఆలోచన చేస్తుందని తెలిపారు. క్రవారం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామంలో ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయామనే భావన కులం, మతం, ధనిక , పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో రూ. 200 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు అవసరమని చెప్పారు. మానవ వనరులకు సానపడితేనే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు. అందుకు అందరికీ విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వం ఉచితంగా అందాలన్నారు. అందుకే ఈ రెండు అంశాలపైనే దృష్టి సారించి ముందుకు పోతుందని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే పాఠశాల నిర్వాహకులు పిలవగానే గతేడాది జనవరి లో సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి రూ. పది కోట్లు కేటాయించారని వివరించారు. ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

గత పాలకులు ఐఐటీలను అనాధలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఆధునిక యంత్ర పరికరాలను తీసుకువచ్చి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవసరమైన సిలబస్ను రూపొందించామన్న భట్టి…. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐ లను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలియవన్నారు. ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు అని వివరించారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హరగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు.