Take a fresh look at your lifestyle.

తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

 ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:  ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వారిపై వికారాబాద్ జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారీ విక్రయం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా టీమ్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు మరియు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన మొహమ్మద్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఆహార పదార్థాల కల్తీకి పాల్పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.