ముద్ర, శేరిలింగంపల్లి: ప్రజలకు గాయాలు, ప్రాణనష్టం జరగకుండా నివారించే ముందస్తు లక్ష్యంతో వీధులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలపై కోసిన, తెగి పడిపోయి ఉన్న మాంజాను గుర్తించి తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో ప్రజలు, వాకర్స్ స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా గచ్చిబౌలి, అమీన్ పూర్, పటాన్‌చెరు, కొల్లూరు, ఐడి్‌ఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో విస్తృతంగా ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి పోలీసులు మూడు టీమ్ లు ఏర్పడి కొండపూర్, మజీద్ బండ ప్రాంతాల్లో ప్రజల సహకారంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, భవనాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రమాదకర మాంజా ను వినియోగించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలాపూర్ మైదానం, తులసివనం కాలనీలో 150 వాకర్లతో కలిసి దారాలను తొలగించారు. వీటి వాడకం చట్ట విరుద్ధమని, కొన్నా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అవగాహన కల్పించారు. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రి గ్రౌండ్, సాకి చెరువు, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో స్థానికులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు, ఓజోన్ హైట్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రోడ్లపై ఉన్న గాజు నూలును తొలగించారు.

ప్రాణాంతక పతంగి నూలు తయారీ, విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు. ఎక్కడైనా మాంజా వేలాడుతూ కనిపిస్తే జాగ్రత్తగా దాన్ని తొలగించి డిస్పోజ్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.