ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:
శారద పీఠం భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. కోకాపేట లోని శారద పీఠం భూములను జలమండలికి కేటాయించారు. పీఠం భవనాన్ని కూల్చివేయడానికి శుక్రవారం రాత్రి నుండి అధికారులు ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న
మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకొని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆ భూములను యధావిధిగా శారద పీఠానికే కొనసాగించాలని నిర్ణయించింది.
ఇది భక్తుల విజయం….
శారద పీఠం భూములను జలమండలికి ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
కోకాపేటలో శారదా పీఠంకు కేటాయించిన భూములను పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేయడం రాజ శ్యామలా
దేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయం అని సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరియైన బుద్ధి ప్రసాదించిన రాజ్య శ్యామల అమ్మవారికి నమస్సులు తెలియజేస్తున్నానన్నారు.
ఎలాంటి స్పష్టమైన ప్రజా ప్రయోజన ప్రతిపాదిక లేకుండా, పర్యావరణ నియమ నిబంధనలకు విరుద్ధంగా , ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ, నామినేషన్ పద్ధతి లో మీ అల్లుడి అనుయాయులకి హెచ్ ఎం డి ఏ ద్వారా కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకునే రేవంత్ ప్రభుత్వం చర్యలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అన్నారు.