ముద్ర, శేరిలింగంపల్లి :
శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే మాదాపూర్ పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి వారి సౌజన్యంతో సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని సిబ్బందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ శిబిరంలో భాగంగా సిబ్బందికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, షుగర్, రక్తపోటు, కిడ్నీ పనితీరును తెలిపే క్రియాటినిన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారని పేర్కొన్నారు.
పరీక్షల అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధుల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. రక్తంలో క్రియాటినిన్, సీరమ్ స్థాయిల ప్రాముఖ్యతను వివరించారు. కిడ్నీల ఆరోగ్యానికి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగాలని, ఆహారంలో ఉప్పు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని సూచించారు.ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను దూరం పెట్టవచ్చని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.