- తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు అవకాశమివ్వాలి.
- కేంద్ర నిర్ణయంతో తెలంగాణలో 20వేల విద్యార్ధుల భవిష్యత్తు అంధకారం.
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రం, ఏపీ సర్కార్ నిర్ణయంతో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసిన 20వేలకు పైగా విద్యార్థులు అయోమయంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయని, తెలంగాణలో కూడా తొందరగా సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విన్నవించారు.ఈ విషయంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లల విద్యకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో గత పదేళ్లుగా 67 శాతం తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటాను ఇచ్చేది.ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూల్స్‌లో 67 శాతం లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో తెలంగాణకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.ఈ విషయంపై ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ను కలిశారు.తెలంగాణ రాష్ట్రానికి మూడు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అలాగే ఏపీ సైనిక్ స్కూల్స్‌లో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థుల కోటాను కొనసాగించాలని విజ్ఞప్తి పత్రాన్ని అందించారు.