Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్ 

 

ముద్ర ప్రతినిధి, మెదక్:

యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా, రైస్ మిల్లర్  యాజమాన్యాలతో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు. ప్రభుత్వo ఒక క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389, సాధారణ రకానికి 2,369 గా నిర్ణయించిందన్నారు.

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలని సూచించారు. యాసంగి సీజన్ కు 4, 45, 466 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 413 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఐకెపి 154, పిఎసిఎస్ 224, డీసీఎంఎస్ 9, ఎఫ్పిఓ 26  మొత్తం 413 కేంద్రాలు ప్రారంభం కానున్నాయన్నారు.

రైతుల వద్ద ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామన్నారు. ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. వడగండ్లు, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

సరైన తేమశాతాన్ని నమోదు చేసి, ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనర్లలో సమస్యలు తలెత్తితే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డిఓ రమాదేవి, గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు దేవ్ కుమార్, నిత్యానంద్, జగదీష్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.