హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి
ఫిబ్రవరి 11: పనికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. సైదాబాద్‌కు చెందిన పల్లవి సిండే (26) అనే యువతి అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు వివరాలు:
సైదాబాద్ నివాసి ప్రకాష్ సిండే కుమార్తె పల్లవి సిండే, కేపీహెచ్‌బీ కాలనీలోని ‘మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్’లో ఉన్న కోడ్-జెన్స్ టెక్నాలజీ (Code-Gens Technology) కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 09:20 గంటలకు ఆమె విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది.
చివరి కాల్ ఛార్జింగ్ అయిపోతుందనే:
అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పల్లవి తన మొబైల్ (7093545647) నుండి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తాను ఆఫీసు నుండి బయలుదేరానని, ఇంటికి వస్తున్నానని సమాచారం ఇచ్చింది. అలాగే తన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతోందని కూడా తెలిపింది. అయితే ఎంత సమయం గడిచినా ఆమె ఇంటికి చేరుకోలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె మొబైల్‌కు ఫోన్ చేయగా, అది ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ పల్లవి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి ప్రసిద్ధ సిండే కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తు:
బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు ‘మహిళ మిస్సింగ్’ కేసు నమోదు చేశారు. యువతి ఆఫీసు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను, ఆమె ప్రయాణించిన మార్గాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.