Take a fresh look at your lifestyle.

డీలిమిటేషన్‌పై చంద్రబాబు, జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

మహిళా బిల్లు కోసం 1952 నుంచే కమ్యూనిస్టు ఎంపీల పోరాటం
మహిళా  బిల్లు ముసుగులో మోదీ 3 కీలక బిల్లుల ఆమోదానికి కుట్ర
కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయటమే దక్షిణాది రాష్ట్రాలకు శాపమా
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
ముద్ర,  విజయవాడ : పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీల తరఫున స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మహిళా బిల్లును తాము స్వాగతిస్తున్నామని, ఈ బిల్లు ముసుగులో కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మోదీ ప్రభుత్వం తెరదీసిందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ఎంపీల స్థానాలను తగ్గించే కుట్రకు తెరదీసిందని ధ్వజమెత్తారు. నాడు కేంద్ర ప్రభుత్వ విధానమైన కుటుంబ నియంత్రణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ శాపంగా పరిణమించిందన్నారు.
విజయవాడ దాసరి భవన్‌లో గురువారం ఈశ్వరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారత కోసం, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కమ్యూనిస్టు పార్టీలు ప్రారంభం నుంచే పోరాడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 1952 నుంచి 1967 వరకు వరుసగా మూడుసార్లు ఎంపీగా ఉన్న రేణుకా చక్రవర్తి మహిళా హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడిన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం సీపీఐ తరఫున 7 పర్యాయాలు ఎంపీగా ఉన్న గీతాముఖర్జీ జాయింట్ సెలెక్ట్ కమిటీకి ఛైర్మెన్‌గా ఉండి, మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 డిసెంబర్ 9న పార్లమెంట్‌లో పెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వివిధ పార్టీలను సమీకరించి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఆనాడు ఈ బిల్లును అడ్డుకునేందుకు ఉమా భారతి వంటి బీజేపీ ఎంపీలు.. వివిధ కారణాలతో అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ప్రస్తుతం 131వ రాజ్యాంగ సవరణ పేరిట మహిళా బిల్లును ప్రవేశపెడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మహిళా బిల్లుపై ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూనే, దీని అమలును 2024, 2029 కాకుండా 2034కు వాయిదా వేయడం వెనుక జనగణన, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలను కారణంగా చూపుతున్నారని తెలిపారు. ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా ఓటర్లను ఆకర్షించాలనే రాజకీయ ఉద్దేశ్యం కూడా ఇందులో దాగి ఉందని ఆరోపించారు. అదేవిధంగా, డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ స్థానాలను 835కు పెంచే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 543 పార్లమెంట్ స్థానాలలో మహిళా రిజర్వేషన్ అమలు చేయకూడదా? పార్లమెంట్ స్థానాలను పెంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలా? ఎవరిని సంతప్తి పరచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు? సంపద సష్టించేందుకే తపన పడుతున్నానని గొప్పలు చెబుతున్న చంద్రబాబు నాయుడు ఆ సంపద సష్టి ఎపీ కోసమా? లేక యుపీ కోసమా? ఎన్‌డిఎ ప్రభుత్వానికి తలొగ్గి ఎపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిని నీరుగార్చారో అలాగే డీలిమిటేషన్ విధానంలో కూడా చంద్రబాబు అదే తరహా ఆత్మగౌరవాన్ని కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు.
1970 దశకంలో జనాభా నియంత్రణ చర్యలను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేసినప్పటికీ, ఇప్పుడు అదే కారణంగా ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి తీసుకురావడం అన్యాయమని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్ ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలను వాయిదా వేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఒక అవకాశంగా తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు తన లేఖలో స్పష్టత ఇవ్వలేదని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకమవుతుందని, ఇది కేవలం రాజకీయ అంశం కాకుండా విధానపరమైన సమస్యగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. 2020-21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడినా, ప్రపంచంలోని అనేక దేశాలు తమ జనగణన పూర్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  2023లో బిల్లు ఆమోదించినప్పటికీ, 2025 నాటికి కూడా అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయకుండా, ఇప్పుడు డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరైనది కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్ విధానాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్‌రెడ్డి, కె.రామాంజనేయులు, దోనేపూడి శంకర్,  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, ఎస్. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.