తొందరపాటు… అజాగ్రత్త వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
స్కూల్ బస్సు డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఎస్పీ డాక్టర్ వినీత్
ముద్ర, నారాయణపేట:
డ్రైవర్ అంటేనే వృత్తి కాదని సమాజంలో సామాజిక బాధ్యత అని… డ్రైవర్లు సేఫ్ జోన్ లో వాహనాలు నడిపితే పోలీస్ శాఖకు విధినిర్వాహణలో పెద్దగా పని ఉండదని కొంతమంది డ్రైవర్ల జాగ్రత్త నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరిగి పోలీస్ శాఖకు పని ఒత్తిడి మరింత పెరుగుతుందని ఎస్పీ వినీత్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారి సౌజన్యంతో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఎస్పి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని కండిషన్ లో నడపగలమని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వాహన చోదకుడు వాహనానికి సంబంధించిన పత్రాలు, జాగ్రత్త వస్తువులు తప్పక వెంట తీసుకురావాలన్నారు. కుటుంబ సభ్యులు తప్పకుండా తమ ఇంటి నుంచి బయటకు వెళ్లే తోటి కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా హెల్మెట్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాలన్నారు. ఒక వ్యక్తి అంటేనే ఒక కుటుంబం యొక్క బాధ్యత అని అలాంటిది అనుకోని రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తి చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హత్యలతో జరిగే మరణాల కంటే రోడ్డు ప్రమాదాలతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయని వీటి నివారణ కోసం అందరూ సమిష్టిగా కృషిచేసి రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని. రాబోయే రోజుల్లో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. స్కూల్ బస్సు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రుల పిల్లల యొక్క భవిష్యత్తు డ్రైవర్ల చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రెప్పపాటు క్షణంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అందుకోసం ప్రతిక్షణం అప్రమత్తంగా వాహనాన్ని నడపాలన్నారు. ఆర్డీవో రామచంద్రరావు, డి.ఎస్.పి లింగయ్య, డిఎం అండ్ హెచ్ వో జయచంద్ర మోహన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టాడ్, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య, లయన్ రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.