ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రానికి సంబంధించిన విభజన మామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయకుండా కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అవుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలు స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు జాతీయ హోదా, కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ప్రకటన డిమాండ్స్‌ను బడ్జెట్‌లో విస్మరించారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్య నిరుద్యోగం, ఆర్థిక అంతరాలకు సంబంధించి ఏలాంటి పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ మధ్య తరగతి పేదలకు ఉపశమన ఇవ్వకపోగా, కార్పొరేట్స్‌కే అనుకూలంగా ఉన్నదని అన్నారు. మూలిగే నక్కపై తాటి పండులాగా ఇప్పటికే రుణాలు, ఆర్థిక భారాలతో సతమతమవుతున్న రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి ‘జిరామ్‌జి’ పథకం ద్వారా రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని వేయడం సరికాదన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటాను కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం పట్ల రాష్ట్రం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.