Take a fresh look at your lifestyle.

సామాజిక సేవ అంటే ఆర్థికసాయమే కాదు

  • సరైన మార్గదర్శనం ద్వారా కూడా మార్పు తేవొచ్చు.
  • సమష్టిగా అడుగు ముందుకేస్తేనే సానుకూల ఫలితం.
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

హైదరాబాద్, ముద్ర ప్రతినిధి: సామాజిక సేవ అంటే కేవలం ఆర్థిక సాయం చేయడమే కాదు. మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మానవ జీవితంలో సమాజమే కీలకమని, ఒంటరిగా కాకుండా సామూహికంగానే అభివృద్ధి చెందగలమన్నారు. బుధవారం గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనం లో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్స్ లెన్స్(సీబీఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజానికి మనం ఎంత ఇస్తే, అది అంతకు రెట్టింపు తిరిగి ఇస్తుందనీ, అది ధనం రూపంలో కాకపోయినా, ఆత్మ సంతృప్తి రూపంలో, ఆశీర్వాదాల రూపంలో తిరిగి వస్తుందనీ అన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం తనకు ఎల్లప్పుడూ సంతృప్తినిచ్చే అంశమని చెప్పారు. ఒక్కరిగా మనమేం సాధించలేం. అదే సమష్టిగా అడుగు ముందుకేస్తే అసాధ్యం అంటూ ఏదీ ఉండదనీ అన్నారు. వర్తమానంలో సమాజం పట్ల మన బాధ్యతలు ఏమిటి, భవిష్యత్తుకు ఎలా మార్గదర్శనం చేయగలమో తెలుసుకొని ఆ దిశగా పని చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.”బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో కొందరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ పునరుద్ఘాటించారు. ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేసారు. విద్యా, ఉపాధి రంగంలో బ్రాహ్మణ యువతను అత్యున్నత స్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేస్తున్న సీబీఈ సేవలు స్ఫూర్తిదాయకమని. ఈ సంస్థ ద్వారా సమాజం కోసం తమ వంతుగా పాటు పడుతున్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు, ఇతర నిపుణుల కృషి అనిర్వచనీయమన్నారు.ఈ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహకారంతో ఈ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీబీఈ ద్వారా సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అయిదుగురు అభ్యర్థుల బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చిన ప్రణీత్ కన్ స్ట్రక్షన్స్ అధినేత నరేందర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీ దేవి, పురాణం సతీష్ కుమార్, వాలంటే టెక్నాలజీస్ సీఈవో, కో ఫౌండర్ విజయ్ వొద్దిరాజు, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ ఎస్ రావు, వేణుగోపాల చారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐవైఆర్ కృష్ణారావు, జ్వాలా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.