Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో భూ భార‌తి ట్రిబ్యున‌ల్ ఏర్పాటు

  • తహసీల్దార్ మొదలు సీసీఎల్ఏ, ఆపై స్ధాయిలో అప్పీల్ కు అవకాశం.
  • నాలుగు పైల‌ట్ మండ‌లాల్లో 13వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.
  • ఈనెల 30వ తేదీలోగా ప్రతి స‌మ‌స్యను ప‌రిష్కరిస్తాం.
  • ప‌ట్టాదారు పాసు పుస్తకంలో భూక‌మ‌తాల మ్యాపుల ముద్రణ‌.
  • నిర్మల్ , ఆసిఫాబాద్ జిల్లాల భూభార‌తి స‌ద‌స్సుల్లో.
  • రాష్ట్ర రెవెన్యూమంత్రి పొంగులేటి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : భూ భార‌తి చ‌ట్టం అమ‌లులో భాగంగా ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రక‌టించారు. భూభార‌తి నాలుగు పైల‌ట్ మండ‌లాల్లో 13వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. వీలైనంత‌ వ‌ర‌కూ ఈనెల 30వ తేదీలోగా ప్రతి స‌మ‌స్యను ప‌రిష్కరిస్తామ‌ని వెల్లడించారు.తహసిల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, ఆపై ట్రిబ్యునల్ స్థాయిల్లో అప్పీల్ వ్యవస్థను ఈ చట్టం అనుసరించి రూపొందించినట్లు తెలిపారు. శుక్రవారం నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ‌మ‌తి సీత‌క్క తో క‌లిసి భూభార‌తి అవ‌గాహ‌న స‌ద‌స్సుల్లో మంత్రి పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూశాఖ సేవలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు. భూభారతి కార్యక్రమం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం వేగవంతంగా జరగడమే కాకుండా, రైతులకు నమ్మకమైన భూ సమాచారం అందుతోందని మంత్రి తెలిపారు.వాస్తవిక డేటాతో భూ పత్రాలను సమర్పించడంతో భవిష్యత్తులో హక్కులపై ఆందోళనలు తలెత్తవని స్పష్టం చేశారు.ఉద్దేశ్యపూర్వకంగా భూ సమస్యలను అ పరిష్కృతంగా ఉంచుతే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు.భూ యజమానుల భూ కమతాలకు మ్యాపులను పట్టాదారు పాసుపుస్తకంలో ముద్రించి ఇస్తామని తెలిపారు. ఆరువేల మంది లైసెన్సు కలిగి ఉన్న సర్వేయర్లను అధికారికంగా నియమిస్తున్నామని చెప్పారు. దీంతో భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు.అలాగే త్వరలోనే గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తున్నామని అన్నారు.భూములు ఉన్న ప్రతి ఒక్కరికి భూ భారతి చట్టం ద్వారా రక్షణ ఏర్పడుతుందని అన్నారు.పట్టా లేని భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన పోడు భూముల రైతులకు పట్టాలు అందజేస్తామని అన్నారు.ధ‌ర‌ణి పోర్టల్ వ‌ల్ల రైతులు నిద్రలేని రాత్రులు గ‌డిపార‌ని, గ‌త ప్రభుత్వం చేసిన నిర్వాకం వ‌ల్ల తొంద‌ర‌పాటు వ‌ల్ల వారి ప్రమేయం లేకుండానే రైతులు శిక్షను అనుభ‌వించార‌ని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్లపై ఆందోళన వద్దు..ఇందిర‌మ్మ ఇండ్లపై ఆందోళ‌న వ‌ద్దని మంత్రి పొంగులేటి సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని చెప్పారు.తొలి విడతలో ఇండ్లు రానివారు ఆందోళన చెందవద్దన్నారు.మొదటి విడతగా ప్రతీ నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మరో నాలుగు విడతల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ స‌మావేశాల్లో సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.