Take a fresh look at your lifestyle.

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నిర్మూలనకు ముందుకు రావాలి అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూను అంతం చేద్దాం

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్

సమాజ భాగస్వామ్యంతో అందరం కలిసి సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, డెంగ్యూ వైరస్‌ను మోసుకొచ్చే ఏడీస్ దోమ కాటు ద్వారా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రారంభ దశలోనే రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స పొందితే వ్యాధి సులభంగా తగ్గుతుందని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వర్షాకాలంలో జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణకు అవసరమైన పరీక్ష కిట్లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తల వద్ద కూడా ఈ కిట్లు ఉంటాయని పేర్కొన్నారు.

డెంగ్యూ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే దోమ కాటు నుంచి రక్షించుకోవడమే ఉత్తమ మార్గమని చెప్పారు. ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాల్లోని నీటి తొట్టెలు, డ్రమ్ములు, బకెట్లలోని నీటిని ఖాళీ చేసి కొబ్బరి పీచుతో శుభ్రపరిచి, అరగంట ఆరబెట్టి మళ్లీ నీరు నింపుకోవాలని సూచించారు. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లాస్టిక్ సీసాలు వంటి పనికిరాని వస్తువులు నిల్వ లేకుండా తొలగించాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ప్రదీప్, వైద్యాధికారులు డాక్టర్ వాణి, డాక్టర్ సృజన, సీహెచ్ఓ వై. శ్రీనివాసులు, ఎంఫీహెచ్ఈఓలు ఫసియుద్దిన్, రాజేష్, ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, ఫార్మసీ అధికారి సురేష్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ కృష్ణారావు, హెల్త్ అసిస్టెంట్లు రాజవర్ధన్ రెడ్డి, మల్లేష్, ఏఎన్ఎంలు జీజే కవిత, కవిత, సరస్వతి, లక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.