మద్దూరు వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ముద్ర, నారాయణ పేట :
భవిష్యత్తు లో వచ్చే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ను సిద్ధం చేసుకున్నట్లు కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక తెలిపారు. పర్యావరణ విపత్తులను ఎలా ఎదుర్కోవాలి? ఎలా సన్నద్ధం కావాలని శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని మక్తల్ నియోజక వర్గం కృష్ణానది లో ప్రవాహం పెరిగి వరదలు, వరద ఉదృతి వచ్చే ప్రమాదం ఉంటుందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తు లో ప్రమాదాలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఆయా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా స్పందించాలి?. తీసుకోవాల్సిన ముందస్తు కార్యాచరణ ఏమిటి అన్నదానిపై చర్చించారు. సమావేశంలో రూపొందించుకున్న కార్య చరణతో ఈ నెల 18 న ఉదయం 8 గంటల నుంచి జిల్లాలోని ఎంపిక చేసిన 7 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాక్ డ్రిల్ కు ఎలా సిద్ధం కావాలి, డ్రిల్ లో ఏం చేయాలి అనే విషయాలపై కలెక్టర్ అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. సోమవారం ఉదయం మాక్ డ్రిల్ చేసేందుకు జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతమైన హిందూపూర్, వాసు నగర్ లో 5 ప్రాంతాలతో పాటు మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ఎల్లమ్మ కుంట కాలనీ, మక్తల్ ఏరియా ఆసుపత్రి ని ఎంపిక చేసినట్లు ఆమె వెల్లడించారు. కృష్ణా నదిలో ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు వస్తే వరద ఉదృతి పెరుగుతుందని? వరద సమాచారం వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 7లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఎగువన ఉన్న నారాయణ పూర్ నుంచి వస్తే మూడు గంటలలోపు కృష్ణా నదికి వరద ఉదృతి పెరుగుతుందని, నదీ పరివాహక ప్రాంతాలు జల మయం అయ్యో ప్రమాదం ఉందని కలెక్టర్ కు వివరించారు.
మద్దూరు వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మద్దూరు మండల కేంద్రంలోని మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను చూసి మిల్లులకు తరలించాలని ఆదేశించగా, దొడ్డు రకం వడ్లు ఎక్కువగా ఉన్నాయని, కోస్గి ధనలక్ష్మి రైస్ మిల్లు యజమాని బస్తాలను పంపించ వద్దు అని చెప్పి కేవలం కోస్గి మండలానికి చెందిన కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే బస్తాలను మాత్రమే మిల్లుకు తెప్పించుకుంటున్నారని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడి మద్దూరు కేంద్రానికి చెందిన ధ్యానం బస్తాలను మిల్లు లో దించుకునేలా చూడాలని ఆదేశించారు. కేంద్రానికి ఇంతవరకు 16 వేల బస్తాలు విక్రయానికి వచ్చాయని, ఇంకా 5 నుంచి 7 వేల బస్తాలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు.