Take a fresh look at your lifestyle.

ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సుకు ఎంపీ లక్ష్మణ్

  • దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్న  ఎంపీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కామన్ వెల్త్  పార్లమెంటరీ అసోసియేషన్ యూకే, ఫిజీ రిపబ్లిక్ పార్లమెంటు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా పిసిఫిక్ ప్రాంతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కు దక్కింది. ఈనెల 19 నుంచి 21 వరకు ఫిజీ దీవుల్లోని నాడిలో జరిగే ఈ సదస్సులో  డా. లక్ష్మణ్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో పబ్లిక్ ఫైనాన్స్ ను సునిశితంగా పరిశీలించే అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.పబ్లిక్ ఫైనాన్స్ లో మరింత జవాబుదారీతనాన్ని తీసుకువచ్చి పీఏసీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.1948లో స్థాపితమైన కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సుపరిపాలనను పెంపొందించడానికి,మానవ హక్కులను రక్షించడానికి కామన్ వెల్త్  దేశాలలో ప్రజాస్వామ్య పద్ధతులను పటిష్టపర్చేందుకు పని చేస్తోంది. ప్రస్తుత ఆసియా పసిఫిక్ ప్రాంతీయ పీఏసీ సదస్సులో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఆహ్వానిత పార్లమెంటు సభ్యులు పాల్గొంటారు.ఈ సదస్సులో ఆయా ప్రజాస్వామ్య దేశాల్లోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీల పనితీరు, సమర్థతపై చర్చించనున్నారు.ఈ కార్యశాలలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్  కె.సి.వేణుగోపాల్, డాక్టర్ కె.లక్ష్మణ్ లను ఎంపిక చేసింది. ఈనెల 21న జరగనున్న సెషన్ 10లో ‘‘పీఏసీ సమర్థతను అంచనా వేయడం,ప్రభావాన్ని కొలవడం, పనితీరును మెరుగుపరచడం’’ అనే కీలక అంశంపై డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగించనున్నారు. పీఏసీ సభ్యుడిగా విశేష అనుభవం ఉన్న డా. లక్ష్మణ్ భారతదేశంలో పీఏసీ పనితీరును సవివరంగా వివరించడంతో పాటు పలు నిర్మాణాత్మక సూచనలు చేయనున్నారు. పీఏసీ నివేదికల ప్రభావం, విచారణను మెరుగుపర్చేందుకు అనుసరించాల్సిన వినూత్న పద్ధతులను తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.అలాగే జవాబుదారీతనం పెంపొందించేందుకు టెక్నాలజీ వినియోగంపైనా ఈ చర్చ దృష్టి కేంద్రీకరిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.