ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న వెనుకబడిన బీసీ మాలి కులంలో జ్యోతిరావు పూలే జన్మించినట్లు తెలిపారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన పూలే, మొదట ప్రాథమిక విద్యను అభ్యసించి, తరువాత కొంతకాలం వ్యవసాయంలో తండ్రికి సహాయం చేశారు. అయితే ఒక ఉపాధ్యాయుడు ఆయన ప్రతిభను గుర్తించి విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడంతో ఉన్నత విద్యను అభ్యసించారు.
సామాజిక సంస్కర్తగా ఆయన కులవివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనంపై తీవ్రంగా పోరాడారని తెలిపారు. వితంతువులకు పునర్వివాహం చేసే అవకాశాలు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అణగారిన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన కృషి చేశారు. 13 ఏళ్ల వయసులో వివాహం జరిగిన తన భార్య సావిత్రీబాయి పూలేకు స్వయంగా విద్యాబోధ చేసి ఆమెను దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదని పేర్కొన్నారు.
1848లో మహారాష్ట్రలోని పూణే నగరంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు నాంది పలికారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పాఠశాలలను స్థాపించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, జై భీమ్ దీక్ష నాయకులు పరశురాములు, బంగారయ్య, మహేష్, వేముల కురుమయ్య, రాము, పారిజాత, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.