మాధకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అధికారులతో పాటు ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని కోరారు.
జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాధకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ లో అమ్మకాలను పరిశీలించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం తదితర అంశాల్లో జనవరి 2025 నుండి జిల్లాలో ఇప్పటివరకు 37 కేసులు నమోదు చేశామని అన్నారు. 87 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. జిల్లాలో 42 కిలోల 225 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే డ్రగ్స్ డిడక్షన్ కిట్ల ద్వారా తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కు పాదం మోపుతామని అన్నారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ సమావేశానికి హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నదులపై చెక్ డ్యాములు నిర్మించినచోట భద్రత దృశ్య డ్యాముకు ఎగువన, దిగువన 300 మీటర్ల వరకు ఇసుక తోడడం నిషేధమని, అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా పరిధిలోని నదీ ప్రవాహాలకు సంబంధించి సరిహద్దులను పక్కాగా గుర్తించాలని, రికార్డు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవిన్యూ, ఆర్.డబ్ల్యూ.ఎస్, టిజిఎండిసి, పోలీస్ అధికారులు సమన్వయంతో ఇసుక రీచ్ లను తనిఖీ చేయాలని అన్నారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ పోర్టల్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపు పై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ డిడి శ్యాంప్రసాద్ నాయక్, డిపిఓ జగదీశ్వర్, జిల్లా జియాలజిస్ట్ ప్రసన్న, డి ఈ ఈ రాజేందర్, డిప్యూటీ డిఈ వేణుగోపాల్, మైండ్స్ ఏడి రాఘవరెడ్డి, టీజీఎండిసి పిడి శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవి, ఆర్ఓ కనుక జ్యోతి పాల్గొన్నారు.