Take a fresh look at your lifestyle.

నివాసం ఉండకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు-హౌసింగ్, రెవెన్యూ, సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు

 

తిరిగి అర్హులైన కొత్త లబ్దిదారులకు కేటాయిస్తాం

మార్చి 31లోపు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి

హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయండి

 

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

ప్రభుత్వ పథకాల కింద   ఇండ్లు పొందిన లబ్దిదారులు తమకు కేటాయించిన ఇండ్లలో తప్పకుండ నివసించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కేటాయించిన ఇళ్లల్లో నివాసం ఉండని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి హౌసింగ్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మిషన్ భగీరథ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని ఆదేశించారు. తుది గడువు మార్చి 31లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంబంధిత ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీల సహాయంతో ఎంపిక చేసిన లిస్ట్ ను జిల్లా మంత్రి గారి ఆమోదం తీసుకొని గజిటెడ్ ఆఫీసర్ ద్వారా ధృవీకరణ చేసి మంజూరు చేస్తారని కలెక్టర్ తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులు వాటిలో నివాసం ఉండని లబ్దిదారులందరు ఈ నెల 31వ తేదీ వరకు తమకు కేటాయించిన ఇండ్లలో తప్పనిసరిగా నివసించాలని ఆదేశించారు. ఇళ్ల లో నివాసానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. లేని యెడల ఏప్రిల్ మొదటి వారంలో వారికి కేటాయించిన ఇండ్లను రద్దు చేసి కొత్త వారికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
హౌసింగ్ కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి

జిల్లాలోని అన్నీ ప్రభుత్వ హౌసింగ్ కాలనీలలో అవసరమైన మౌలిక సదుపాయాలైన విద్యుత్ సరఫరా, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశుధ్యం పనులు చేపట్టాలని సంబంధిత మెట్రో వాటర్ వర్క్స్, మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన ఎల్2 లిస్ట్ దరఖాస్తుదారులు ఇంకా మిగిలి ఉంటే దగ్గరలో ఉన్న ఎకరం కంటే ఎక్కువ ఉన్న స్థలాలను గుర్తించి మంజురి నిమిత్తం ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా డబల్ బెడ్ రూమ్ ల కాలనీలలో ఉన్న దుకాణాలను వేలం వేయాలని సూచించారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆయా హౌసింగ్ కాలనీల అభివృద్ధి నిమిత్తం ఉపయోగించడం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులందరూ నిర్లక్ష్య ధోరణి అవలంభించకుండా పూర్తి బాధ్యతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సమన్వయంతో సమిష్టిగా పని చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె.శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.చాంప్లా నాయక్, ఆర్డీఓలు అనంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సరిత, పార్థసింహ రెడ్డి, తహసీల్దార్లు, హౌసింగ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.