Take a fresh look at your lifestyle.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసరలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన బాసర పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబోయే ప్రాంతాల వివరాలను మంత్రులకు వివరించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్న ప్రదేశాలను మంత్రులు పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్ర రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఆలయ ఈవో విజయ రామారావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.