ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రాష్ట్రస్థాయి పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి ఏ. నిరంజనమ్మను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ నెల 15న హనుమకొండ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన మూడవ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచిన ఆమెను ఆలేరు ఉప ఆరోగ్య కేంద్రంలో శాలువా కప్పి, బంగారు పతకం మరియు ప్రశంస పత్రాలను అందజేసి సత్కరించారు.
ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి నాయక్ మరియు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 400 మీటర్ల రేసులో చివరి క్షణం వరకు నిరంజనమ్మ చూపిన పట్టుదల ఆమె గెలుపు తపనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో పాల్గొని జిల్లాకు కీర్తి తీసుకువచ్చిన ఆమె అంకితభావాన్ని ప్రశంసించారు.
భవిష్యత్తులో మరింత కృషి చేసి జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. తన వయసును మించి ప్రతిభ కనబరిచి పరుగు పందెంలో పాల్గొనడం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని అన్నారు. ప్రజారోగ్య సేవలు అందించే నర్సుగా పనిచేస్తూనే క్రీడల్లో కూడా రాణించడం ఎంతో ప్రేరణనిచ్చేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి నాయక్, డీఐఓ సురేష్ బాబు, డాక్టర్ నాగేశ్వరి, తెలకపల్లి సర్పంచ్ కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.