Take a fresh look at your lifestyle.

కరీంనగర్ ‘కొత్త’ కొలువు.. సవాళ్ల ‘పెద్ద’ కొలువు!

 

– కొత్త పాలకవర్గానికి సరికొత్త సవాళ్లు
– ముందుంది ముసళ్ల పండగ
– అసంపూర్తి పనులు పూర్తయ్యేనా?
– నగర సుందరీకరణపై ఆశలు
– అవినీతి అనకొండలపై కొరడా ఝలిపిస్తారా.?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్:

కరీంనగర్ కార్పొరేషన్ గా మారిన తరువాత నగరం నాలుగు చెరుగులా విస్తరించింది. ఊహించని రీతిలో చుట్టు ఉన్న గ్రామాలు నగరంలో విలీనమయ్యాయి. ప్రధాన రహదారి తప్ప, అంతర్గత రోడ్లు, కాలనీలు అభివృద్దికి నోచుకోలేదు. గత పాలకులు అభివృద్ధి పేరుతో దోపిడికి పాల్పడ్డారని, కబ్జాలు చేసి ప్రజల్లో చులకన అయ్యారని మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసి 66 డివిజన్లలలో 30 డివిజన్లు కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన బీజేపీ నూతన పాలకవర్గం సరికొత్త సవాళ్లను ఎదుర్కోబోతుంది. నగరంలో అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. తమకు ఒక్క అవకాశమివ్వండి.. నగరం రూపురేఖలు మారుస్తామని గద్దెనెక్కిన కొత్త పాలకవర్గంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పాలకవర్గం ఎంత వరకు ఈ సమస్యలపై దృష్టి సారిస్తుందో చూడాలి.

అసంపూర్తిగా రోడ్డు పనులు..
స్మార్ట్ సిటీ అయిన తరువాత కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులు, జంక్షన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతర్గత రోడ్లు, డివిజన్లలలో చిన్న కాలనీలకు సంబంధించిన లింక్ రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో సీఎం హామీ పథకం కింద రూ.130 కోట్లతో నగరంలో 60 రోడ్ల పనులు చేపట్టారు. వాటిలో సగం పనులు ప్రారంభించినా, రాష్ర్ట ప్రభుత్వం మారగానే సదరు కాంట్రాక్టర్లు ఆ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో రెండేళ్ల నుంచి అసంపూర్తి పనులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్య..
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలనొప్పిగా మారాయి. ప్రధాన రహదారుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కార్యాలయాల వేళల్లో విపరీతమైన రద్దీ వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్న ల్స్ అవసరమైన కూడళ్లలో లేకపోవడంతో వాహనాలు గంటలకొద్ది జామ్ అవుతున్నాయి. సిగ్నల్ లు ఉన్న కూడళ్లలో ఎక్కువ సమయం వాహనాల నిరీక్షణ వల్ల వాహనదా రులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్పాత్లు, రోడ్ల ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ రోడ్లతో పుట్పాత్లు ఏర్పాటు చేయడంతో, అవి కాస్త ఇరుకుగా మారాయి, పైగా ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలు సాగిస్తుండడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. రోడ్లు కూడా నాణ్యత కోల్పోయాయి.

24 గంటలు నీటి సరఫరా ఎక్కడా..?
రాష్ట్రంలోనే మొదటిసారిగా 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తున్న నగరంగా గుర్తింపు పొందిన కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చాలా డివిజన్లలో నీటి ఎద్దడి పట్టి పీడిస్తున్నది. హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వా యర్ పరిధిలో 24 గంటల నీటి సరఫరాను ప్రారంభించినప్పటికి, పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. మిగతా రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు తాగునీటి సరఫరా జర గాల్సి ఉండగా, కోతిరాంపూర్, అంబేడ్కర్, కోర్టు రిజర్వాయర్ల పరిధిల్లో రెండు రోజులకో మారు అది కూడా సరిపడా నీరు రావడం లేదు.
నగరవ్యాప్తంగా నల్లా పైప్ లైన్ లీకేజీ నిత్య సమస్యగా మారింది. కమాన్, రాంపూ ర్. కోర్టు, నాకా చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లపై పైప్ లైన్ లీకేజీలు కనిపిస్తాయి. వీటి వల్ల తాగునీరు కలుషితం అవుతోంది. రోజుల తరబడి లీకేజీతో రోడ్లపై నీళ్లు వరదలా పారుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. లీకేజీతో రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

వర్షాకాలంలో ముంపు తప్పదు..
ఇక వర్షాకాలంలో నగరంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు లెక్కలేదు. రోడ్ల నిర్మాణంలో చూపిన శ్రద్ధ డ్రెయినేజీలపై చూపలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, నగరంలోని ముకరాంపుర, శర్మనగర్, ఆర్టీసీ వర్క్ షాప్, రాం నగర్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఆర్అండ్ బీ కల్వర్డులు చిన్నగా ఉండడం, పూడిక పేరుకుపోవడం, డ్రైనేజీల లింకులు సక్రమంగా లేకపోవడంతో వరద నీరు ముందుకు వెళ్లలేక సమీపంలోని ఇళ్లు, చౌరస్తాలను ముం చుతున్నాయి. ముకరాంపురలోని విమానం వీధి ప్రతిసారి వరద ముంపును ఎదుర్కొంటూనే ఉంది.

పారిశుధ్యం గాలికి..
నగరంలో పారిశుధ్యం నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి. పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లాల్సిన స్వచ్చ ఆటోలు కొన్ని డివిజన్లలో సక్రమంగా వెళ్లడం లేదు. రెండు రోజులకు ఒకసారి కూడా వెళ్లని డివిజన్లు కూడా ఉన్నాయి. దీనితో పలు డివిజన్లలో ఇండ్లల్లో చెత్త పేరుకుపోతోంది. వాణిజ్యపరంగా చెత్త సేకరణను ప్రైవేట్ ఏజె న్సీకి అప్పగించడంతోనూ, కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించడం సంవత్సరానికి ఒకసారి కూడా జరగని ప్రాంతాలున్నాయి.

చిమ్మచీకట్లో కాలనీలు
వీధి దీపాల నిర్వహణ నగరంలో సమస్యగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో నిర్వహణ లేక వీధి దీపాలు లేక చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. టవర్ సర్కిల్, కలెక్టరేట్, హౌసింగ్ బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ లైట్ల నిర్వహణ సక్ర మంగా లేకపోవడంతో అప్పుడప్పుడు అలంకారప్రాయంగా మారుతున్నాయి.

బస్ షెల్టర్లను పట్టించుకోరూ..
నగరంలో బస్ షెల్టర్ల ఏర్పాటులో విచిత్ర పరిస్థితి నెలకొంది. కావాల్సిన చోట్ల షెల్టర్లు లేక, షెల్టర్లు ఉన్న చోట నిరుపయోగంగా ఉంటున్నాయి. బస్ కోసం ఎదురుచూసే క్రమంలో రోడ్డుపైనే నిలబడడం, లేదా చెట్టునో, షాప్ రేకులనో ఆశ్రయించాల్సివస్తోంది.

కోతులు, కుక్కల బెడద తప్పదా..
నగరంలో కోతులు, కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. కోతులు గుంపులుగా ఇండ్ల పైకి వస్తుండడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్లల్లోకి చొరబడి తినుబండారాలు, నిత్యావసర వస్తువులు పట్టుకెళ్తున్నాయి. రోడ్లపై, నివాసాల నడుమ కుక్కలు గుంపులుగా తిరుగుతూ భయోత్పతాన్ని సృష్టిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.