Take a fresh look at your lifestyle.

అనర్హులకు లబ్ధి చేకూరిస్తే చర్యలు … అర్హులకు అన్యాయం జరుగవద్దు

  • అధికారులు జాగ్రత్తగా ఉండాలి
  • మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు
  • మార్చి 31లోగా నాలుగు స్కీంలు అమలు
  • నేడు నాలుగు పథకాలు ప్రారంభం
  • అధికారులు, మంత్రులతో సమీక్షలో సీఎం రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభమవుతాయని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆదివారం నుంచి నాలుగు పథకాలను అమలు చేయనున్న నేపథ్యంలో శనివారం ఉదయం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సీఎం రేవంత్​ రెడ్డి.. మంత్రులు, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి సహా ఇతర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత గ్రామ, వార్డుల సభల గురించి ఆరా తీశారు. వారి నుంచి సమాచారం తీసుకున్నారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దని.. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని అధికారులను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ హెచ్చరించారు. పథకాల అమలులో నిజమైన లబ్దిదారులకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగ కూడదని, ఈ విషయంలో అధికారులపై చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రజలకు ఇవ్వనున్నామని, లబ్దిదారులకు కచ్చితంగా న్యాయం జరిగాలని, అలాగని అనర్హులకు లబ్ది చేస్తే సహించేది లేదన్నారు. లక్షల్లో దరఖాస్తులు రావడంతో జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

గ్రామసభలు ఎలా జరిగాయి..?

ఈ సందర్భంగా గ్రామసభలు జరిగిన తీరును మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. చాలా గ్రామాల్లో గొడవల అంశాన్ని ప్రస్తావించారు. అసలు సభల్లో ఎందుకు వాగ్వాదం జరిగిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విపక్షాలు రాద్ధాంతం చేశాయని మంత్రులు వివరించారు. కొంతమందితో గ్రామసభల్లో ఆందోళన చేశారని, గ్రామాల ప్రజలు మాత్రం ఈ సభలను సద్వినియోగం చేసుకున్నారన్నారు.

నేడు నాలుగు పథకాలు ప్రారంభం

రాష్ట్రంలో ఒకేసారి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ మేరకు శనివారం కీలక సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను సేకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఎదురుచూస్తున్న రైతు భరోసా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సంక్షేమ పథకాల అమలుపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను సీఎం ప్రారంభించారు. రేపు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా పథకాల అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

కాగా, ఈ 4 పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మొత్తం 16,348 గ్రామ సభల్లో లబ్దిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. అలాగే.. జాబితాలో లేనివారి పేర్లను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలను కంప్యూటర్లలో డేటా ఎంట్రీ చేస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం నాడు సీఎం 4 పథకాలు ప్రారంభించిన అనంతరం. లబ్దిదారుల అకౌంట్లలోకి నగదు జమ కానుంది. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున (రెండు విడతలు) చెల్లిస్తారు.

కానీ, ఎన్నికల సమయంలో మాత్రం రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని సర్కార్ ఇది వరకే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు సాగు భూముల లెక్కలు తేల్చారు. సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి ఖరీఫ్, రబీ సీజన్‌లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక, ఇందిర ఇండ్లకు లబ్దిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలను పలు దఫాలుగా అందజేస్తారు.

Leave A Reply

Your email address will not be published.