- ట్యాపింగ్ కేసులో కొత్త కోణం
- త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ 15 రోజుల పాటు ట్యాప్
- ఇంద్రసేనారెడ్డి పీఏను విచారించిన పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో భాగంగా పలు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఏకంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 2023 నవంబర్ నెలలో దాదాపు 15 రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా అధికారుల విచారణలో తేలినట్లుగా సమాచారం ఈ మేరకు ఇంద్రసేనా రెడ్డి వ్యక్తిగత సహాయకుడిని సైతం పోలీసులు విచారిస్తున్నారు.
కాగా ఆయన గవర్నర్ గా 2023 అక్టోబర్ 26న బాధ్యతలు స్వీకరించారు. దీంతో గవర్నర్ గా కొనసాగుతున్న సమయంలోనే ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు మరింత లోతుగా ఈ కేసులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయ. కాగా వ్యవహారానికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదెలా ఉండగా ఈ కేసులో నిందితులను అమెరికా నుంచి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా రేపో మాపో కీలక నిందితులు నగరానికి రానున్నారని తెలుస్తోంది. వాళ్ళు హైదరాబాద్ కు వస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.