Take a fresh look at your lifestyle.

అద్దె చెల్లించనందున మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు తాళాలు

  • ఇదేనా మీ ప్రజా పాలన…..ఇదే కదా కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం.
  • ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అద్దె చెల్లించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపాటు.

ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు.కొట్లాడి సాధించుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా అన్నిరంగాల్లో ముందంజలో నిలబడితే శుష్క వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అధోగతి చేస్తూ కేసీఆర్ చేసిన మంచి పనులను కూడా ముందుకు తీసుకు పోవడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటు భవనానికి కాంగ్రెస్ పాలకులు అద్దె కూడా చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళాలు వేసిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రజా పాలన అంటే మెడికల్ కళాశాలకు తాళాలా?విద్యార్థులకు అవమానాలా?అని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.జిల్లాకో మెడికల్ కళాశాలలో భాగంగా కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన కళాశాలను కొత్త భవనం నిర్మాణం అయ్యేవరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిన మెడికల్ కాలేజ్ ను కొనసాగించడం జరిగిందని పేర్కొన్నారు.అయితే కాంగ్రెస్ పాలనలో మెడికల్ కాలేజ్ భవనం అద్దెను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ యజమానులకు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. దీంతో మంగళవారం మెడికల్ కాలేజ్ భవనానికి యాజమాన్యం తాళాలు వేయడంతో విద్యార్థులు రోడ్డున పడాల్సి వచ్చిందని అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వ విధానాలకు రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు అద్దె చెల్లించకపోవడం ఒక తార్కాణమని విమర్శించారు.కేసీఆర్ హయాంలో నాడు వైద్యాన్ని,వైద్య విధ్యను ప్రజల దగ్గరకు తీసికువస్తే నేడు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు.ప్రభుత్వ అసమర్థత కారణంగా నేడు మెడికల్ కళాశాలకు తాళాలు పడి విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ రూ.176 కోట్లతో రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ, నిధులు విడుదల చేశారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం కాలేజ్ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.తాళం వేసిన మెడికల్ కళాశాలను వెంటనే తెలిపించి విద్యార్థులకు సజావుగా తరగతులు జరిగేలా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వాన్ని కోరారు.రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ప్రభుత్వ మెడకల్ కాలేజ్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి జిల్లా ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.