ముద్ర: మహాదేవపూర్: విద్యార్థులు తమ సంబంధంలోకి వచ్చే సంబంధాల విషయంలో మంచి ఏది చెడు ఏది అనే విచక్షణను ప్రయత్నపూర్వకంగా ఏర్పరచుకోవాలని షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ కోరారు. షీ టీమ్ మరియు భరోసా సంయుక్తంగా భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించి, అపరిచితుల ఫోన్ మరియు వీడియో కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు.
మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరికైనా అసభ్య ప్రవర్తన ఎదురైతే ధైర్యంగా 8712658162 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, అవసరమైతే కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాల , వసతి గృహాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, ఘటనలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది మరియు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.\