కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పేటలో బీజేపీ నిరసన
ముద్ర, నారాయణపేట:
కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ గూండా గిరి చేస్తే సహించేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై బీ కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నోటికి అడ్డంగా నల్ల గుడ్డలు ధరించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులను ఆపకపోతే రాబోయే రోజుల్లో బిజెపి ఆధ్వర్యంలో మరింత ఉదృతంగా ఉద్యమాన్ని చేపడుతామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్ పర్సన్ మంజుల రాఘవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు సౌజన్య, ప్రభాకర్, అప్పిరెడ్డిపల్లి రాము, ఎరుకలి రఘు, కమలాపూర్ శ్రీనివాస్, మిర్చి వెంకటయ్య, బిజెపి మండల నాయకులు సాయిబన్న, కృష్ణ, హనుమంతు, భరత్, పళ్ళ రఘు, చేతన్, మణిశంకర్ తదితరులు పాల్గొన్నారు.