- ప్లాట్ ఓనర్ల అనుమతితోనే లేఔట్ రివైజింగ్.
- లే ఔట్‌ల అంశంపై చర్చించిన హైడ్రా సదస్సు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : లే ఔట్ ఏదైనా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని లే ఔట్‌లపై హైడ్రా శనివారం నిర్వహించిన సదస్సు అభిప్రాయ పడింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో హైడ్రా, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు నిపుణులు హాజరయ్యారు.10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే ఆ లేఔట్లను గుర్తించాల్సినవసరం ఉందన్నారు. అందులో మార్పులు చేయాల్సి ఉంటే అప్పటికే ప్లాట్ల కొన్నవారి అనుమతితో రివైజ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే 10 శాతం పార్కులు, ప్రజావసరాలకు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ ఎండీఏ ఇలా ఏ స్థాయిలో లే ఔట్ అనుమతులు పొందినా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ప్రభుత్వానికి హక్కులుంటాయనన్నారు. అన్ ఆథరైజ్డ్, అన్ అప్రూవల్ , అప్రూవల్ లే ఔట్లు ఏంటి..? వాటికి సంబంధించిన జీవోలను పరిశీలించారు. ఎకరం స్థలంతో మొదలై.. ఎంత విస్తీర్ణంలో అయినా లే ఔట్లు వేసుకోవచ్చనని పేర్కొన్నారు.
- రెవెన్యూ రికార్డుల్లో మార్చాల్సినవసరం ఉంది.
దశాబ్దాల క్రితం గ్రామపంచాయతీలు అనుమతి ఇచ్చిన లే ఔట్ల విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాల్సినవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది.సదరు భూమి లే ఔట్‌గా మారిందనే విషయం రెవెన్యూ రికార్డులలో నమోదు కాకపోవడంతోనే తర్వాత తరం వారు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఆయా స్థలాలమీదకు వెళ్లి వ్యవసాయ భూమి పేరిట ఆక్రమణలు చేస్తున్నారని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ అనుమతి పొందిన పాత లే ఔట్ల విషయంలో కొన్ని ప్లాట్లు రెగ్యులరైజ్ అయితే ఆ లే ఔట్‌ను గుర్తించినట్టేనన్నారు.తర్వాత ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం జరగదని, ఒక వేళ రద్దు చేస్తే అందులో ప్లాట్లు కొన్న వారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు.ప్రిలిమనరీ అప్రూవల్‌తో అమ్మకాలు జరపవచ్చునని పేర్కొన్నారు. అయితే లే ఔట్ స్వరూపం మారరాదని చెప్పారు.
- అన్ ఆథరైజ్డ్ నిర్మాణాలను తొలగించవచ్చు.
తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వాటిపైన చర్యలు తీసుకోవచ్చునని సదస్సు అభిప్రాయ పడింది. ఇందుకు సంబంధించి సుప్రింకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సదస్సు కూలంకుషంగా చర్చించింది.చెరువు పరిధిలో నిర్మించిన కట్టడాల విషయంలో కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తొలగించ వచ్చనని పేర్కొంది. రహదారులు, పార్కులలో నిర్మాణాలు చేపట్టినా ఇది వర్తిస్తుందని సూచించింది.అలాగే రెగ్యులరైజ్‌చేసిన ఇంటి స్థలాలు చెరువు ఎప్‌టీఎల్ పరిధిలోకి వస్తే వాటిని రద్దు చేసే అధికారం కూడా ఉందని పేర్కొంది.పాత, కొత్త లేఔట్‌లున్న సమయంలో పాత లే ఔట్లో రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే ఫైనల్ లే ఔట్ వస్తే అందులో ఎలాంటి మార్పులు చేయరాదని సుప్రింకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన ఆక్రమణల తొలగింపులో ఎదురైన అంశాలను కమిషనర్ శఏవీ రంగనాథ్ వివరించారు.హైడ్రా చర్యలతో ఇంటి స్థల పరిరక్షణపై భరోస వస్తోందని పలువురు పేర్కొన్నారు. సుస్థిరమైన స్థిరాస్తి వ్యాపారం వృద్ధి జరుగుతుందన్నారు.
- హైడ్రా కమిషనర్ కు ఆత్మీయ సత్కారం.
శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో చెరువును కాపాడిన హైడ్రాను ప్రశాంతి హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అభినందించింది.అప్పటికే కొంత ఆక్రమణలకు గురి కాగా, ప్రస్తుతం 29 గుంటలుగా మిగిలిన కుమ్మరి కుంటను కాపాడడంలో హైడ్రా చొరవను కొనియాడింది.తాము వినతి పత్రం అందించిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, కుమ్మరికుంట పరిరక్షణకు చర్యలు తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారిని అభినందించింది.కాలనీ ప్రతినిధులు శనివారం హైడ్రా కమిషనర్ ను కలిసి శాలువతో సత్కరించారు.రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో చెరువు హద్దులు నిర్ధారించడంతో తాము అంతా కలిసి కంచె వేసుకోవడానికి వెసులుబాటు లభించిందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఈ కుంటను కాపాడుకోవడానికి చాలా అవస్థలు పడ్డామని, గత ఐదేళ్లుగా రాత్రీ పగలు కాపలా కాయాల్సి వచ్చిందని అన్నారు. హైడ్రా సమర్థ నిర్ణయం, సత్వర చర్యల వల్ల 3600 చ.గ. అడుగులు (సుమారు 100 కోట్ల రూపాయల విలువ గల) ప్రభుత్వ భూమిని భూభక్షకుల నుంచి కాపాడడమైందన్నారు. చెరువుకు ప్రాణం పోయడమే కాదు ప్రశాంత్ హిల్స్ కాలనీ, సమీప ప్రాంతాలలో నివసిస్తున్న 5,000 మంది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇచ్చినట్టయ్యిందన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు మాట్లాడుతూ స్థానికులు ముందుకు వచ్చి ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, రహదారులు కబ్జాకు గురి కాకుండా చూడాలన్నారు. కాలనీ వాసులకు హైడ్రా తోడ్పడుతుందని చెప్పారు.
