Take a fresh look at your lifestyle.

షాడో నేతల చీకటి దందా..!

…………………………………….

– నేతల అండ తో ఇసుక మాఫియా బరితెగింపు
– రాత్రికి రాత్రే భారీ వాహనాలతో ఇసుక తరలింపు
– ఒక రాత్రికి జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వి డంపులుగా వేయడం
– మరో రాత్రి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలింపు
– రోజు ఇదే వరుస… రూ. లక్షలు చేతులు మారుతున్న వైనం
– ఇసుక మాఫియాకు అండదండలుగా మైనింగ్, రెవిన్యూ, పోలీస్ శాఖ లు
– వాహనాల ట్రిప్పులు లెక్కపెట్టేందుకు కానిస్టేబుళ్ల కు డ్యూటీ
– ఒక్కో వాహనానికి రూ. 5 వేల నుంచి రూ.12 వేల మామూళ్లు
– ప్రతి శాఖ కు, అధికార నేతలకు నెలకు లక్షల్లో అందుతున్న మామూళ్లు
– ఫొటోలతో సహా సాక్ష్యాలు కలెక్టర్ కు సమర్పించిన వాగు పరిసర గ్రామాల ప్రజలు..
– చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు
………………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
అధికారం అడ్డు పెట్టుకుని ఉమ్మడి జిల్లా లోని పలు నియోజకవర్గాల్లో షాడో నేతల సహకారం తో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.

ఇప్పటి వరకే జిల్లా లో వాగులన్నింటిలో ఇసుక తరలింపులో మాఫియా తలమునకలవుతోంది. ఈ దందా అంతా చీకట్లోనే జరుగుతోంది. ఇసుక తరలింపును అడ్డుకునే పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ శాఖ ల అధికారులు ఏమి చేస్తున్నారనే అనుమానం రాక మానదు. వారి అండ దండలతో ఈ వ్యాపారం నెలకు రూ కోట్లల్లో జరుగుతోంది. వీరి వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు అధికార పార్టీ షాడో నేతలు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గం ఎమ్మెల్యే లకు తెలియదనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. వీరిని అడ్డు పెట్టుకుని కొందరు షాడో నేతలు ఇసుక మాఫియా కు అండగా ఉన్నారనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఇసుక తరలింపు పై పలు గ్రామాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థ లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు.
ముఖ్యంగా నారాయణ పేట, దేవరకద్ర నియోజకవర్గాల్లో ని మండలాల్లో ఇసుక మాఫియా తిష్ట వేసింది.ఇక్కడ మండలాల్లో ఇప్పటికే వాగులన్నీ ఖాళీ అవుతున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులు ఇసుక తరలించే రోజు ఒక్కో బెంజి వాహనానికి ఎనిమిది నుంచి రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు.వాహనాల లెక్కించేందుకు కానిస్టేబుళ్ల ను వాగుల వద్ద డ్యూటీ చేస్తున్నారు. ఈ వాగుల నుంచి రోజు వందల చొప్పున వాహనాలు ఇసుక ను ఇతర జిల్లా లకు తరలిస్తున్నారు. ముఖ్యంగా నారాయణ పేట నియోజకవర్గం లోని కోయిల కొండ పెద్ద వాగు ఇసుకాసురులకు కాసులు కురిపిస్తోంది. ఈ వాగు లో సూరరం, మల్లాపూర్, శేరి వెంకటాపూర్, జమాల్ పూర్, లింగాల్చేడ్ పరిసర గ్రామాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. వర్షాకాలంలో ఈ వాగు నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టు భారీ గా నీరు చేరుతుంది. ఈ ప్రాజెక్టు కు ఈ వాగే అతి ప్రధానమైన నీటి వనరుగా ఉంది. ప్రతి ఏడాది ఈ వాగులో భారీగా ఇసుక మేటలు ఏర్పడుతాయి. ప్రతి ఏడు ఈ వాగు లో ఇసుక తరలించి అక్రమంగా రూ. కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడి పోలీసులు, రెవిన్యూ అధికారులకు నెలలా రూ. లక్షల్లో మాముళ్లు అందుతాయి. ఈ విషయం జిల్లా కలెక్టర్ కు పలు గ్రామాల ప్రజల ఫిర్యాదుతో బట్టబయలు అయింది. ఇక్కడ ఒక ఎస్ ఐ, తహసీల్దార్ పోస్టుకు రేటు నిర్ణయించారు. పోస్టింగ్ కోసం ఓ షాడో నేతకు రూ. ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షలు సమర్పించు కుంటారనే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో కంప్లైంట్ చేసినా చర్యలు శూన్యం. ఈ పెద్ద వాగు నుంచి రాత్రి సమయంలో ఇసుక ను తవ్వి ఒక చోట డంప్ చేసిన మరుసటి రోజు రాత్రి ఈ డంప్ నుంచి భారీ వాహనాలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఈ వాహనాల ట్రిప్పుల లెక్కలు రాసేందుకు కోయిల కొండ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ డంప్ వద్ద డ్యూటీ లో ఉంటారు. ఈ కానిస్టేబుల్ పేరుతో సహా స్టేషన్ హౌస్ అధికారి, తహసీల్దార్ పై ఓ స్వచ్చంద సంస్థ జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు, జిల్లా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడం తో వీరిపై హై కోర్ట్ లో కూడా పిటిషన్ వేస్తామని ఈ సంస్థ సభ్యులు పేర్కొంటున్నారు. చీకటి దందా ను ఫోటో లతో సహా జిల్లా అధికారులకు సమర్పిస్తే చర్యలు తీసుకోవడం లో విఫలమవుతున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. ఎస్ ఐ, తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే హై కోర్ట్ ద్వారా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని వారు అంటున్నారు. ఎన్ని ఆరోపణలు ఉన్నా ఈ అధికారుల పై చర్యలు తీసుకోక పోవడం కూడా షాడో నేత అడ్డుకుంటున్నారని సమాచారం. ఇక్కడ ఇలా ఉంటే దేవరకద్ర నియోజకవర్గం లోని ఊకచెట్టు వాగు లో కూడా ఇదే పరిస్థితి. ఇదే నియోజకవర్గం లోని మొల్గర వాగు కూడా ఇసుక మాఫియాకు, అధికారులకు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తోంది. మిడ్జిల్ మండలంలోని డిండి వాగు లో కూడా ఇదే విధంగా ఇసుక తరలిస్తున్నారు. ఈ వాగులో భారీ గా ఇసుక నిల్వలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇసుకాసురలకు కాసుల పంటే పండుతోంది.వీటి పై జిల్లా కలెక్టర్ కు పదుల సంఖ్య లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాగు పరిసర గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా లో మైనింగ్ శాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. వాగుల్లో ఇసుక నిల్వలు లేకుంటే భూగర్భ జలాలు అడుగంటి రబీ పంటలు ఎండి పోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయి లో పడిపోయాయని అ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇసుక తరలింపు పై జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక మాఫియా పై ఉక్కుపాదం మోపాలని వాగు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.