ముద్ర, అనంతపురం ప్రతినిధి:
రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు “మీ రాజధాని ఏది?” అని అడిగితే గర్వంగా అమరావతి అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నించారని, ఇకపై ఒకే రాజధాని అమరావతేనని తేల్చిచెప్పారు. పార్లమెంట్‌లోని 50 పార్టీలలో వైసీపీ తప్ప మిగతా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారని తెలిపారు. వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు.
అమరావతి పనులు వేగంగా కొనసాగుతుండటాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు.
రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, మధ్యాంధ్రలో అమరావతి, దక్షిణాంధ్రలో తిరుపతి కేంద్రాలుగా అభివృద్ధి రీజియన్లను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి జిల్లాలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా చివరి ఎకరాకు కూడా నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి కొందరు ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఆడబిడ్డల భద్రతపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలపై దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
దేవాలయాలపై దాడులు జరిగాయని, తిరుమలలో శ్రీవారి ప్రసాద నాణ్యతను దెబ్బతీశారని, కల్తీ నెయ్యి ఉపయోగించడం వంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందేలా “జలధార” కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చిన సీఎం, నీటి వనరుల సమర్థ వినియోగంతో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.