Take a fresh look at your lifestyle.

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి:

రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది వేసవికి ముందు భూగర్భ జలాలు 8 మీటర్ల లోతులో ఉండగా, వేసవి తర్వాత 3 మీటర్లకు చేరుకున్నాయని చెప్పారు.

అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల లోతులో లభించిన భూగర్భజలాలు ప్రస్తుతం 11 మీటర్లకే అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. భూసంరక్షణ చర్యల ఫలితంగా సుమారు 2.2 మీటర్ల మేర జలస్థాయి పెరిగిందని వివరించారు.

అన్నమయ్య జిల్లాలో భూసంరక్షణను ప్రజా ఉద్యమంగా తీసుకుని విజయవంతంగా అమలు చేశారని, ఈ ఉద్యమంలో తాను కూడా ప్రజలతో కలిసి పనిచేస్తానని సీఎం తెలిపారు. ఆ జిల్లాలో 5.7 టీఎంసీల నీరు అందుబాటులోకి రావడంతో పాటు, 20 వేలకుపైగా బోర్లలో నీరు లభ్యమవుతోందని చెప్పారు. దీని వల్ల ఒక్క జిల్లాలోనే రూ.96 కోట్ల విద్యుత్ ఆదా అయ్యిందని వెల్లడించారు.

భూగర్భ జలాల పెరుగుదలతో హరితవనాలు విస్తరించాయని, ఇది సానుకూల పరిణామమని అన్నారు. వర్షాకాలానికి ముందు 6 మీటర్ల లోతులో, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఇది సాధ్యమైతే రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని రాయలసీమకు తరలిస్తున్నామని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించి, అక్కడి నీటిని ఆదా చేసి రాయలసీమకు మళ్లిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రానికి ఖరీఫ్ పంటలకు 547 టీఎంసీలు, రబీ పంటలకు 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28 టీఎంసీలు, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరమవుతుందని, మొత్తం మీద 1300 టీఎంసీల నీటి అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది మాత్రమే అనంతపురం వరకు 74 టీఎంసీల నీటిని తీసుకువచ్చినట్లు చెప్పారు.

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాను పండ్ల తోటలతో సమృద్ధిగా మార్చడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచుతూ రూ.1.24 లక్షల కోట్ల అప్పులు చేశాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.4,600 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా భరిస్తోందని, విద్యుత్ చార్జీలను తగ్గించిన ఘనత తమదేనని అన్నారు.

భూమినే జలాశయంగా భావించి నీటిని సంరక్షించుకోవాలని సూచించిన సీఎం, ప్రస్తుతం రబీ, ఖరీఫ్ పంటలు పూర్తయ్యాక కూడా రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వ ఉందని చెప్పారు. “జలం మనకు సంపద. దాన్ని పొదుపుగా వాడుకుంటే మరింత సంపద సృష్టించవచ్చు” అని ఆయన ముగించారు.

Leave A Reply

Your email address will not be published.