Take a fresh look at your lifestyle.

నన్ను వేశ్యలా చూశారు

  • ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి.
  • మహిళలకు తగిన గౌరవం లేకపోవడం బాగా కలిచివేసింది.
  • పోటీ ఉద్దేశ్యం మంచిదే అయినా, నిర్వహణ పద్దతులు సరిగా లేవు.
  • మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ.
  • ఆమె స్థానంలో ఫైనల్‌లో పాల్గొననున్న మిస్ షార్లెట్ గ్రాంట్.
  • 74 ఏళ్ళ మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ వైదొలగడం ఇదే తొలిసారి.
  • కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు బాగోలేక మిల్లా మాగీ వెళ్ళిపోయింది.
  • మిల్లా మాగీ ఆరోపణలను ఖండించిన నిర్వాహకులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వైదొలగుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె, ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉదయం నుండి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని, తమను వేశ్యలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ నడుస్తోంది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైదొలగడం ఇదే ప్రథమం. 24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది.మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా.. ఇప్పుడు ఆమె హఠాత్తుగా వైదొలిగింది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు మిల్లా మాగీ వివరించింది.. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక కొన్నిసందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తుందని, సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించింది. ఈ పోటీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ నిర్వహణ పద్దతులు మాత్రం సరిగా లేవని ఆమె చెప్పింది. తనలో మార్పు కోసం ఈ పోటీలకు వచ్చానని, కానీ ఇక్కడి పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధానం పూర్తిగా తప్పు అని, తాము ఇలా చేయడానికి రాలేదన్నారు. ప్రజలను అలరించడానికి మేం అక్కడ కూర్చునే కోతులం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా మహిళలకు తగిన గౌరవం లేకపోవడం తనను బాగా కలచివేసిందని, అందుకే తాను పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు మిల్లా మాగీ చెప్పుకొచ్చింది. మిల్లా మాగీ ఈ పోటీ నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్‌లో పాల్గొంటున్నారు.ఈ ఫైనల్ ఈ వారం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారం కానుంది. మే 31న హైటెక్స్‌ వేదికగా మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ అంగరంగ వైభవంగా జరగనుంది.

  • కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల బాగోలేక వెళ్ళిపోయింది – నిర్వాహకులు.

ఇండియా లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుండి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు. ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.మిస్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుండి వైదొలిగిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్ 1వ రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఆమె ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు. మిస్ షార్లెట్ బుధవారం ఇండియా కు చేరుకున్నారని, మిస్ వరల్డ్ సోదరభావంతో ఆమెను పోటీలలో పాల్గొనటకు అనుమతించడం జరిగిందని ఈ పోటీలలో ఆమె పాల్గొంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని UK మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అపవాదకరమైన కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు.మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలియా మోర్లే ఆ ప్రకటనలో వివరించారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, “బ్యూటీ విత్ ఎ పర్పస్” అనే విలువలకు నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయి.మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటిస్తూ, తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు తగు ఆధారాలతో, వివరణతో ధృవీకరించుకోవాలని జూలియా మోర్లే ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.