Take a fresh look at your lifestyle.

‘మున్సి’పోల్స్ లో హంగ్ పక్కా..మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పూర్తి రుణమాఫీ పచ్చి అబద్దం
నిజామాబాద్, మహబూబ్ నగర్, సచివాలయం ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం
సీఎం రేవంత్ నా సవాల్ ను స్వీ్కరించాలి
బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి
కాంగ్రెస్, బీఆర్ఎస్ సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి
ఓవైసీ బ్రదర్స్… అధికారం చుట్టు తిరిగే సన్ ప్లవర్స్
మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదనడానికి తన వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. పక్కా ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నానని వెల్లడించారు. కావాలంటే సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రమ్మన్నా తాము వస్తామన్న కవిత.. లేకపోతే నిజామాబాద్‌కు రమ్మన్నా సిద్ధమేనని సవాల్ చేశారు. రుణమాఫీ కాని రైతులను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌కు తీసుకొస్తామని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులకు రూ. 44 వేల కోట్లు రుణమాఫీ చేశామన్న గొప్పలు చెప్పుకుంటోన్న సీఎం, మంత్రులు… కేబినెట్ లో మాత్రం రూ. 28 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పినట్లు ఆరోపించారు. వాస్తవానికి రైతులకు చేసిన రుణమాఫీ రూ. 21 వేల కోట్లు మాత్రమేనన్నారు. రైతులకు కనీసం యూరియ కూడా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్… విద్యార్థులకు రూ.11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిపడిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాక ఆడబిడ్డలు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికుల సంఖ్య 52 వేలు ఉంటే… రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 ఏళ్లలో వారి సంఖ్య 32 వేలకు చేరిందన్నారు. చిన్న చిన్న కారణాలకే ఉద్యోగులు, కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని బీఆర్ఎస్ పాలన తీరును విమర్శించారు. ఆర్టీసీ లో తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ వాళ్లనే నియమించాలన్న కవిత… ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క సిద్ధిపేట మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చిందన్న కవిత.. గుంపుమేస్త్రీ, గుంటనక్క స్నేహం కారణంగా సిద్ధిపేట్ లోనే ఆ అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ ఉన్న గుంటనక్కకే పనులు అవుతున్నాయని హరీశ్ రావును ఉద్దేశించి చెప్పారు.

మున్సిపోల్స్ లో హంగ్ పక్కా..
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీల్లో హంగ్ పక్కా అని కవిత జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిశాయన్న కవిత…. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా సీట్లు సర్దుబాట్లు చేసుకున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల కుట్రలను గమనించి తమ తమ వార్డులు, డివిజన్లలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సింహం గుర్తు పై పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేడు జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బూతు పురాణానికి ఎండ్ కార్డ్ పడి చెవులకు ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసలు సమస్యలను గాలికి వదిలి.. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని చెప్పారు. ఈ ప్రచార సరళి చూశాక మున్సిపల్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికల లాగే పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుండు అని అనిపించిందని అన్నారు. మహబూబ్ నగర్ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారని.. కానీ అక్కడ గత రెండు మూడు రోజులుగా మంచినీరు రాని పరిస్థితి ఉందన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు దారుణంగా ఉందని విమర్శించారు.

ఓవైసీ బ్రదర్స్… అధికారం చుట్టు తిరిగే సన్ ప్లవర్స్
ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదొద్దీన్ ఓవైసీ అతని తమ్ముడు ఎమ్మెల్యే అక్బరొద్దీన్ అధికారం చుట్టు తిరిగే సన్ ప్లవర్స్ అని కవిత అభివర్ణించారు. గతంలో రాయల తెలంగాణ అని తెలంగాణను వ్యతిరేకించిన వారిద్దరు తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కలిసి గత ప్రభుత్వంలో అధికారంలో పాలు పంచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో జత కట్టారని సభ్య సమాజం వీరి తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ఓవైసీ బ్రదర్స్ ను వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వారితో దోస్తానా చేస్తారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కోసం ఓవైసీ బ్రదర్స్ అభ్యర్థినే బరిలో నిలుపలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదని విమర్శించారు. ఓవైసీ బ్రదర్స్ కు తమ కమ్యూనిటీపై నిజంగా ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డితో ముస్లింలకు రంజాన్ తోఫా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలో అసలు అభివృద్ధి చేయలేని ఓవైసీ సోదరులు అక్కడ ఎందుకు ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందే..
ఫిబ్రవరి 26న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని కవిత తెలిపారు. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకునే అవకాశం ఉన్న చివరి బడ్జెట్ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లపై ఎన్నికల ఒత్తిడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో భూములు అమ్మడం ద్వారా రూ.7 వేల కోట్లు సంపాదించుకున్నారని, సంపద సృష్టించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. దీంతో రెవెన్యూ లోటు మైనస్ రూ. 9 వేల కోట్లకు వెళ్లిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా బడ్జెట్‌లో బీసీలకు సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచుతూ రూ. 35 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టాలన్నారు. పట్టణ ప్రాంత పేద ప్రజలకు 8 లక్షల ఇళ్లకు గాను రూ. 25 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్థిక సాయం అంశాన్ని బడ్జెట్‌లో పెట్టాలన్నారు. కవులు, కళాకారులకు కేంద్రం ఇచ్చే సాయానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.