- కృష్ణా నదీజలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదమే కారణం.
- తేల్చి చెప్పిన జలశక్తిశాఖ.
- లోక్‌సభలో భువనగిరి ఎంపీ చామల ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్ భూషణ్ లిఖితపూర్వక సమాధానం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి షాకిచ్చింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డిని జాతీయ హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.ఆ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను తాజాగా వెనక్కి పంపింది. కృష్ణా నదీజలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం కోర్టులో ఉందనే కారణాన్ని ఎత్తి చూపుతూ తెలంగాణ అభ్యర్థనను నిరాకరించింది.కృష్ణా ట్రిబ్యునల్-2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని జలశక్తిశాఖ పేర్కొంది. కోర్టు వివాదం నేపథ్యంలో..తెలంగాణ రాష్ట్రం పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తేల్చి చెప్పింది.ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు కేంద్రం లోక్‌సభలో తెలిపింది.2022 సెప్టెంబర్‌లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది.2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనలు తిప్పి పంపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.