Take a fresh look at your lifestyle.

స్వర్ణ గిరిలో ఘనంగా తిరుప్పావడ సేవ

అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో గురువారం తిరుప్పావడ సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు దిట్టకవి శ్రావణచార్యులు మాట్లాడతూ సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడంకోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని చెప్పారు.. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుందని అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ తదితర పిండి వంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రావణ మాసం సందర్బంగా శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్యార్చనలు పూర్తి అయిన తరువాత,నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్నఖచిత స్వర్ణాభరణాలతో,పరిమళ భరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదిప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని ఆర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు శ్రీవారిని నయనానందకరంగా దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.