ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటీగా అమలు చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్ లో నిధులను విడుదల చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు శుక్రవారం నిధులు విడుదల చేశారు. ఉద్యోగులకు ప్రతినెల రూ. 700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అ హామీ మేరకు గత జూన్ నెలాఖరులో రూ .183 కోట్లు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ .700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదలైన బిల్లులో గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్సులు ఉన్నాయి.
గ్రామపంచాయతీలకు రూ. 389 కోట్లు విడుదల
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు.