మళ్లీ పెడదోవ పట్టొద్దు
జనజీవన స్రవంతిలోకి వచ్చి ఏదైనా చేసుకోండి
ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం
ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై ఆలోచన చేస్తాం
మీ లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా
‘మావో’అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో ఏ పనైనా చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే.. ఇతర వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మందలించారు. ఏళ్ల క్రితం అడవిబాట పట్టి వివిధ కారణాలతో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తానని చెప్పారు. ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి( @దేవ్ జీ), మల్ల రాజిరెడ్డి( @సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు( @చంద్రన్న), పోతుల కల్పన(@సుజాత), బడే చొక్కారావు (@దామోదర్) , నూనె నర్సింహా రెడ్డి (@గంగన్న) శుక్రవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా వారితో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక అంశాలు చర్చించారు. రాజకీయ ఎజెండాపైన మాజీ మావోయిస్టులు చర్చలు జరిపారు.
తాము జనజీవన స్రవంతిలో వచ్చేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతిలకు దేవ్‌జీ.. కృతజ్ఞతలు చెప్పారు. భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలన బాగుందని ప్రశంసలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని.. ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం సరైన దారి కాదని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కానీ ఐదెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో లొంగిపోయిన వారికి.. ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దేవ్‌జీ తెలిపారు. కాగా మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టి.. అడవుల్లోని మావోయిస్ట్‌లను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు కూడా నక్సల్స్‌ను లొంగిపోవాలని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల చాలా మంది మావోయిస్ట్‌లు.. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ , నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి పాల్గొన్నారు.