Take a fresh look at your lifestyle.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి..

జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి..

జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర):


ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి యుద్ధ ప్రాతిపాదికన అంచనాలు సిద్ధం చేసి, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమరాజుపల్లి గ్రామంలో మంత్రి స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న దృశ్యాలను పరిశీలించిన మంత్రి, రైతుల ఆవేదనను తెలుసుకుని వారిని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆకాల వర్షాల ప్రభావంతో జిల్లాలో భారీ స్థాయిలో పంటలు నష్టపోయాయని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 6,160 ఎకరాల్లో మామిడి పంట, 1,029 ఎకరాల్లో వరి, 1,520 ఎకరాల్లో మొక్కజొన్న, 581 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారని చెప్పారు.

పంట చేతికి వచ్చే కీలక సమయంలో ఈ విధంగా నష్టం కలగడం రైతులకు తీవ్ర ఆర్థిక దెబ్బ అని మంత్రి పేర్కొన్నారు. రైతులు పెట్టుబడులు పెట్టి, పంటపై ఆశలు పెట్టుకున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు.

నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, ఎవరూ అన్యాయానికి గురి కాకుండా ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా సర్వేలు పూర్తి చేసి, త్వరితగతిన నివేదికలను సమర్పించాలని సూచించారు.

రైతులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిహారం ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన అన్నారు. అధికారులు పారదర్శకంగా పనిచేసి, అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలని మంత్రి సూచించారు.

ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.