Take a fresh look at your lifestyle.

హోటళ్లకు రేటింగ్, సర్టిఫికేషన్; వంటగదుల్లో సీసీ కెమెరాలు, మానిటరింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ కోర్ రీజియన్ పరిధిలోని హోటళ్లలోని వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హోటల్స్‌కు రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలన్న ఆయన ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్స్డ్ ఎక్విప్ మెంట్ వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న అన్ని స్ట్రీట్ లైట్స్‌కు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలన్నారు. టెక్నాలజీ ద్వారా సమస్య తలెత్తిన చోట వెంటనే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగరంలోని సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. ఇందుకు ముందుగా కొన్ని ఏరియాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.