ఈ కేసులో రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి లేదు
తోడ బుట్టిన చెల్లెలే ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతోంది
దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపైనే ట్యాపింగ్ ప్రయోగం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు, ప్రభుత్వం వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ చేస్తోన్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని చెప్పారు. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసును ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదన్నారు. అధికారులకు పరిమితులు ఉంటాయన్నారు. కానీ గత పాలనలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెప్పారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ట్యాపింగ్ చేస్తారని చెప్పారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నారని తనపై నిఘా పెట్టీ ట్యాపింగ్ చేశారని పార్టీ చీఫ్ ఆరోపించారు. అసలు రాజకీయాలకు సినీ తారలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అసలు సినీతారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశరు. కల్వకుంట్ల కవితను తాను ఎప్పుడూ చెల్లెలుగా గౌరవిస్తానని చెప్పారు. వాటాల పంపకంలో తేడాతోనే కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం అని ఆరోపించారు. కవిత ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నాందుకు స్వాగతిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గడిచిన పదేండ్లలో కేసీఆర్ కుటుంబం అలీ బాబా 420 దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. బీఆర్ ఎస్ ను స్టువర్ట్ పురం దొంగల బ్యాచ్ గా అభివర్ణించారు. కార్తీకదీపం గురించి తర్వాత.. ముందు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆగిపోకుండా చూసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్‌ను ప్రశ్నించారు. బీజేపీ నేతల ఈడీ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.