Take a fresh look at your lifestyle.

సిట్ అధికారులకు స్వేచ్ఛ లేదు కేంద్రమంత్రి బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి
కేటీఆర్, హరీశ్ రావు ఫోన్లు ట్యాప్ అయ్యయని చెప్పేందుకే పిలుస్తున్నారా..?

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ అధికారుల విచారణ పక్కదారి పడుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసు విషయంలో సిట్ విచారణ ఆశించిన స్ధాయిలో జరగడం లేదని విమర్శించారు. విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన విధంగానే సిట్ అధికారులు వ్యవహరించాలని ఒత్తిడి పెరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్‌లోని అధికారులు చాలా నిజాయితీపరులు,, అనుభవజ్ఞులన్నారు. వారిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కానీ కేసు విచారణలో వారికి ఎంత స్వేచ్ఛ నిచ్చారనే దానిపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్‌లు అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారని విచారణకు పిలిచారా..? లేక వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారిస్తున్నారా.. ? అనే విషయాన్ని సిట్ అధికారులు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ దందాకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్‌ కూతురు కవితే.. తన ఫోన్‌ ట్యాప్‌ అయిందని చెప్పిందన్నారు. ట్యాపింగ్‌కి భయపడి ఓ ఏడాది హరీష్‌ రావు, కవిత దంపతులు కూడా ఫోన్లు వాడలేదని గుర్తు చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ మాటున రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ బిజినెస్‌మెన్లు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, జడ్జీలు బాధితులు అని జగమెరిగిన సత్యం అన్నారు. కేసీఆర్ కుటుంబమే ఫోన్లు ట్యాప్ చేయించిందని తెలిసినా.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావును అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ధైర్యం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సిట్ విచారణను ఎలా నమ్మమంటారు? ఇప్పటివరకు ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుధంగా వాడుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో బిచ్చగాళ్లు కూడా.. వాట్సాప్‌ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ కేసులో తనకు కూడా సిట్ నోటీసులు ఇచ్చి వాంగ్మూలం తీసుకుందని బండి సంజయ్ అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.