Take a fresh look at your lifestyle.

సిట్ విచారణలో ప్రభుత్వం జోక్యం ఉండదు..ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

 

ఎవరినీ ఎప్పుడు విచారించాలో సిట్ పరిధిలోని అంశం

సిట్ ప్రశ్నలతో హరీశ్ మైండ్ బ్లాక్ అయింది

ఈటల జమున ఫోన్‌ను ట్యాప్ చేసి ఇబ్బందులుపెట్టారు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ చేపడుతోన్న విచారణలో ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఎవరిని విచారించాలి, ఎప్పుడు పిలవాలి అనేది పూర్తిగా సిట్ అధికారుల పరిధిలోని అంశమని చెప్పారు. విచారణలో భాగంగా హరీష్ రావుకు అధికారులు చుక్కలు చూపించారని చెప్పారు. దీంతో ఆయన మైండ్ బ్లాంక్ అయి బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్‌ ను బీఆర్ఎస్ నుంచి పంపించడం వెనుక కూడా ట్యాపింగ్ కుట్రే ఉందని బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఈటల రాజేందర్ భార్య జమున ఫోన్‌ను సైతం ట్యాప్ చేసి, ఆ సమాచారంతోనే ఆయనను ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఇంతటి అక్రమాలకు పాల్పడి కూడా, ఇప్పుడు కేటీఆర్ తానేదో ఘనకార్యం చేసినట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రావడం లేదని చురకలంటించారు. అసెంబ్లీలో చర్చకు తోకముడిచిన బీఆర్ఎస్ నాయకులు, బయట మాత్రం పోరాట యోధులుగా ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైన ఆ పాత్ర పోషించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. కేవలం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎంతటి నీచానికైనా పాల్పడుతుందనడానికి ఈ ఉదంతం ఉదాహరణ అన్నారు. హరీష్ రావు ఆరడుగులు పెరిగాడు కానీ, ఆయన తెలివితేటలు మాత్రం మోకాలిలో ఉన్నట్లున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా హరీష్ రావు ఫోన్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఆ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతోనే హరీష్ రావుకు గతంలో మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు.

Leave A Reply

Your email address will not be published.