జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్తు దేశం రగిలిపోయింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అందుకు అనుగుణంగా అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి.. రెండు వారాల అనంతరం భారత్ ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడి చేసింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి.. వెనక్కి వచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. దాయాదిపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మద్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో సైన్యం అప్రమత్తమైంది.