సంబంధించిన బ్లూ ప్రింట్ ఏర్పాటుకు కసరత్తు
సమాజం కోసం, కళల ద్వారా జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్
ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్
ఉగాది పండుగ రోజు గద్దర్ ఘనంగా అవార్డుల పంపిణీ
గద్దర్ ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే కృతనిశ్చయంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బాంబే, కలకత్తా, చెన్నై వంటి పట్టణాల్లో సినీ ఇండస్ట్రీ పెరగడానికి అంతగా అవకాశాలు లేవన్నారు. కానీ దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీ హైదరాబాద్ లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. సకల భాషల సినీ ఇండస్ట్రీ, హైదరాబాద్ కు తరలి వస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. తమ పాలనలోనే హైదరాబాద్ సినీ ప్రపంచ మార్కెట్ కు కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం కొన్ని దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి వదిలేసిందన్నారు. సమాజంలో అత్యంత ప్రభావం చూపే సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినీ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి తిరిగి ప్రోత్సహించడం ప్రారంభించిందన్నారు. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని చెప్పారు. తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని తెలిపారు. అందుకే వారి పేరు మీద గతేడాది నుంచి సినిమా అవార్డులు ఇస్తున్నట్లు వివరించారు. తద్వారా సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకత లే ప్రమాణంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందన్న భట్టి… గతేడాది జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందిన విషయాన్నిగుర్తు చేశారు. సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగంపై వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్ డి సి ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేశారన్నారు. ప్రభుత్వ నుంచి కావలసిన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందజేస్తామని తెలిపారు. ప్రతి పని సమాజానికి ఉపయోగపడాలనీ ప్రజలకు జవాబు దారిగా ఉండాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది 19న ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప సందేశం ఇచ్చేలా నిర్వహించినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా అదే రీతిలో పెద్ద ఎత్తున గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐ అండ్ పీఆర్ శాఖలకు పూర్తి స్వాతంత్రం, అవసరమైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఐఅండ్ పీ ఆర్ కమిషనర్ ప్రియాంక, ఎఫ్ డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబుతో పాటు సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కెఎస్ రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.