ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత
ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు
ముద్ర, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో అందించిన అల్పాహారం వికటించడంతో ఎనిమిది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోజులాగే ఉదయం విద్యార్థినులకు అల్పాహారం వడ్డించారు. టిఫిన్ తిన్న కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి ప్రారంభమయ్యాయి. విద్యార్థినుల పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల వాహనంలో వెంటనే ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పాఠశాలల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు చేపట్టాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే కారణాలు అధికారులు విచారణ చేపడుతున్నారు.